ఎన్.టి.ఆర్ తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం,

భారత రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు యన్టీఆర్ ఒక్కరే. తెలుగు ప్రజల చరిత్రలో ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక యుగం. తెలుగు జాతిక ఆత్మగౌరవాన్నిశిఖరంగా నిలిపిన మహానాయకుడు. సినీ రంగంలో శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో దేవుడిలా నిలిచారు. ఆయన నటన కేవలం వినోదం కాదు సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. ఆయన ఆత్మగౌరవం అనే నినాదం కేవలం నినాదంగా మిగలలేదు. అదితెలుగు ప్రజల ఆత్మవిశ్వాసంగా మారింది.ఆత్మగౌరవం తో తెలుగు వాడు తలెత్తుకుని నిలబడాలని,ఇతరుల ముందు చేయి చాచే స్థితి రాకూడదని,తెలుగు ప్రజల చరిత్రలో ఆత్మగౌరవం అనే పదానికి రాజకీయ అర్థం ఇచ్చిన మహానాయకుడు.ఆయన రాజకీయం పదవి కోసం కాదు, ప్రజల గౌరవం కోసం. అధికారానికి కాదు, ఆత్మాభిమానానికి. అదే ఆయన రాజకీయ జీవితానికి మూల సూత్రం.ఎన్నికల రాజకీయం కేంద్రంగా కాదు, తెలుగు వాడు తలెత్తి నిలబడాలి అన్న నినాదం మాటలకే పరిమితం కాలేదు. ఢిల్లీలో అధికారం ఎదుట తలవంచని ధైర్యంగా మారింది. రాష్ట్రాల హక్కులు, ఫెడరల్ స్ఫూర్తి, ప్రాంతీయ గౌరవం ఇవన్నీ ఎన్.టి.ఆర్ ఆత్మగౌరవ రాజకీయానికి కేంద్ర బిందువులు అయ్యాయి.ఆత్మగౌరవం అంటే కేవలం భాష, సంస్కృతి మాత్రమే కాదు,పేదవాడి జీవన గౌరవం కూడా. అనేక సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఇవన్నీ పేదవాడు తలవంచకుండా బతికే హక్కుకు ప్రతిరూపాలు అన్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం అందించడమే నిజమైన ఆత్మగౌరవ పాలన అని ఎన్.టి.ఆర్ అనేవారు. ఆయన లేవనెత్తిన ఆత్మగౌరవ జ్వాల ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో దిశానిర్దేశం చేస్తూనే ఉంది.వ్యక్తి పదవికంటే ప్రజల గౌరవమే గొప్పదని చాటి చెప్పిన వ్యక్తి ఎన్ఠీఆర్. కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో ఒక దైవ సమానుడిగా కొలువ అయిన వ్యక్తి నందమూరి తారక రామారావు నేడు ఆ మహనీయుని ప్రస్థానాన్ని 30వ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత. ఎన్.టి.ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన పునాదులు, ఆయన తెచ్చిన సంస్కరణలు నేటికీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కనిపిస్తాయి

నేను పాలకుడుని కాదు,మీ సేవకుడినని,అధికారం కోసం కాదు,ప్రజల గౌరవం కోసం రాజకీయాలని,అన్నం పెట్టే రైతును అవమానించే పాలన నేను చెయ్యనని.ప్రజలే నా అధికారం అని,ప్రజలే నా ప్రభుత్వఅని,పేదవాడి ఆకలి తీర్చ లేక పోతే,ఆ పాలనకు అర్థమే లేదని,అన్నం దానం కాదు పేదవాడి హక్కు అని,నాయకుడు అంటే,ప్రజల వెనుక నిలబడేవాడు కాదు.ముందుకు నడిపించే వాడని,ప్రజల నమ్మకాన్ని దోచుకునే వాడికి పాలన చేసే అర్హత లేదని,కుర్చీ కోసం కాదు.కష్టాల్లో ఉన్న ప్రజల కోసం రాజకీయాలు చెయ్యాలని ఎన్ఠీఆర్ అనేవారు,తెలుగు వారి రాజకీయ అవమానం చూసి కలత చెందారు ఎన్ఠీఆర్. తెలుగు వాడు ఢిల్లీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండకూడదు అనే భావన ఆయనను రాజకీయాల్లోకి తెచ్చింది.దేశంలో ప్రాంతీయ గర్వాన్ని రాజకీయంగా నిలబెట్టిన అరుదైన నాయకుడు. రాజకీయ రంగంలో ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చారు.1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు, అది ఒక సామాజిక ప్రకంపన. కేవలం తొమ్మిది నెలల్లోనే, బలమైన కాంగ్రెస్ పార్టీని కూకటి వ్రేళ్ళతో కూలదోసి 1983లో అధికారంలోకి రావడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అసాధారణ ఘట్టం.ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాలను పాలించే విధానానికి యన్టీఆర్ ఎదురు తిరిగారు. తెలుగు ప్రజల స్వాభిమానమే తన రాజకీయ ధ్యేయంగా ప్రకటించారు.ఆయన ఆలోచనలు, ఆశయాలు ఇప్పటికీ జీవించాయి. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఒక భావోద్వేగం. రాజకీయాల్లో విలువలు, ప్రజా సేవలో నిజాయితీ ఎలా ఉండాలో చూపిన నాయకుడు యన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా ఆకలిని రాజకీయ సమస్యగా గుర్తించి, పాలన అంటే సేవ అనే భావనను స్థిరపరిచారు. సంక్షేమం అనేది ఓటు కోసం కాదు హక్కుగా ఉండాలన్నది ఆయన పాలనా విధానం.పేదవాడి ఆకలి తీర్చడం పాలన ధర్మమని నిరూపించారు.సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, రాజకీయంలో భాగస్వామ్యాన్ని విస్తరించారు.ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనం. పంచాయితీ రాజ్ అభివృద్ధి ద్వారా అధికారాన్ని పంచాయతీలకు చేరువ చేసి ప్రజలకు పాలన దగ్గర చేసారు.
ఆనాటి కేంద్ర ప్రభుత్వం పై ఆయన చేసిన పోరాటం వ్యక్తిగతం కాదు,రాష్ట్ర హక్కుల కోసం సాగిన రాజకీయ యుద్ధం.రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీతో ఢీకొన్న తొలి సీఎం ఎన్ఠీఆర్ .అప్పటి కేంద్రం ఆయనను నానా అగచాట్లు పెట్టింది. గద్దె దింపేందుకు ఎన్నో కుట్రలు పన్నింది.1984లో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలన్న ప్రయత్నానికి ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి ఎన్ఠీఆర్.ఆ పోరాటం, ఒక ముఖ్యమంత్రిని తిరిగి ప్రజల తీర్పుతో అధికారం తెచ్చిన అరుదైన ఉదాహరణ. ఎన్.టి.ఆర్ రాజకీయం రాష్ట్రానికే పరిమితం కాలేదు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయ రాజకీయ వేదికను నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.నేషనల్ ఫ్రంట్ స్థాపనలో కీలక పాత్ర,కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది.ప్రాంతీయ పార్టీలను జాతీయ శక్తిగా మార్చిన నాయకుడు. ఎన్.టి.ఆర్ కేవలం ఒక నాయకుడు కాదు,తెలుగు రాజకీయ చరిత్రలో ఒక యుగం ఆయనది. రాజీ పడటం, లాలూచీ పడటాన్ని ఎన్టీఆర్ సహించేవారు కాదు. ఆయన హయాంలో ఒకసారి కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలుగు దేశం తరపున లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. తరవాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో మనం సయోధ్య కుదుర్చు కుంటే రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందని సలహా చెప్పబోగా, ఆయన సలహా విని ఎన్టీఆర్ ఆయన విరుచుకు పడ్డారు. ఏం తప్పు చేశామని రాజీపడాలి? మన ఆత్మ గౌరవాన్ని దిల్లీ దర్బారుకు తాకట్టు పెట్టే టట్లు అయితే తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించినట్లు? కాంగ్రెస్ లో కలిసి పోతే పోలా?మనం రాష్ట్రాల హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నట్టు? అని ప్రశ్నించారు.ఆయన ఆ విధంగా తుది శ్వాస వరకూ అదే సిద్ధాంతం తో రాష్ట్ర హక్కుల పై రాజీలేని పోరాటం చేశారు. తిరుగుబాటు ఎన్టీఆర్ నైజం, ఆయన అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. తెలుగుజాతి, భాష సంస్కృతులకు ఆగ్ర తాంబూలం దక్కాలని ఎన్టీఆర్ అనుక్షణం పరితపించే వారు. ఆయనకు ఆయనే సాటి,ఆయనను మరెవరితోనైనా పోల్చడం దుస్సాహసం.భౌతికంగా మనల్ని వీడి మూడు దశాబ్దాలు గడిచాయి. నేటి తరం సైతం ఎన్ఠీఆర్ ను గుర్తుచేసుకోవడం సంతోష దాయకం. ఆయన లాంటి మహనీయుడిని మళ్ళీ చూడగలమా?భారత రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు యన్టీఆర్ ఒక్కరే. ఆయన రాజకీయాల్లోకి రావడం సాధారణ పరిణామం కాదు – అది ఒక సాంఘిక, రాజకీయ విప్లవం.యన్టీఆర్ ఒక నాయకుడు కాదు ఒక చరిత్ర.యన్టీఆర్ ఒక ఉద్యమం. కావునా ఎన్ఠీఆర్ లాంటి మహామనిషికి భారత రత్న పురస్కారంతో గౌరవించడం కేంద్రప్రభుత్వ బాధ్యత. ఎన్ఠీఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా ఆ మహానాయకుడికి నా నమస్సులు,శ్రద్దాoజలులు.
నీరుకొండ ప్రసాద్


Neerukonda Prasad
Hyderabad
9849625610

Releated Posts

N.T. Rama Rao: The Leader Who Gave Telugu People Their Self Respect Back!

How a man became a movement and how a generation first met him not on a screen, but…

Feb 10, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *