
ఒక సందర్భంలో కర్ణాటకకి,మనకి నీటి వివాదం తలెత్తింది. తుంగభద్రలో నీళ్లు తక్కువ ఉంటే తన్నుకుంటుంటాం కదా! కావేరీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక తరహాలో.. తుంగభద్ర విషయంలో ఉన్న నీళ్లలో సర్దుబాటు చేసుకోకుండా రాజకీయాలు చేయటం ఏ.పీ, కర్ణాటక మధ్య కూడా ఆనవాయితీగా ఉండేది.హీరోలుగా చెలామణి అయ్యేందుకు ముఖ్యమంత్రులు పోటీ పడుతుండేవారు. నీళ్లు వదలనని ఎగువ రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే, ఎలాగైనా తెచ్చుకుంటానని దిగువ రాష్ట్రం ముఖ్యమంత్రి సవాలు విసురుతుండేవారు. అప్పుడు కూడా అలాగే జరిగింది.
దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి అప్పుడు.ఆయన దిగువకు నీళ్లు వదలనని బీరాలు పలికారు.అప్పుడు తెలుగునాట ప్రభుత్వంలో ఉన్న మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పీలు ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వచ్చి దేవెగౌడ ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్ర ప్రదేశ్ కి ఇవ్వనంటున్నారు, మీరు ఒక్క పిలుపు ఇవ్వండి, మేమంతా వేల సంఖ్యలో కర్ణాటకకు వెళ్లి ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం అన్నారు. పక్కనే ఉన్న నేను భయపడ్డాను. పొరపాటున ఎన్.టి.ఆర్ ఓకే అంటారేమో
వీరంతా పోతే రెండు రాష్ట్రాల మధ్య పోరు అవుతుందేమో, ఇది సరైన పద్ధతి కాదు అని. ఎవరి సలహా అవసరం లేకుండానే ఎన్.టి.ఆర్ అన్నారు.. ఏం మాట్లాడుతున్నారు, అంతా ఒక దేశం కాదా..? కర్ణాటకలో ఉన్నది మన మనుషులు కాదా? అక్కడ తెలుగువాళ్లు,కన్నడవాళ్లు అందరూ ఉన్నారు.అందరూ మనవాళ్లే.
పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. దేవెగౌడ అలా మాట్లాడొచ్చు. నేను కూడా అలా మాట్లాడితే ఎలాగ. బాధ్యతతో ఉండాలి. ఈ దేశమంతా ఒకటే అని వెంటనే కేబినెట్లో మంత్రులకు ఫోన్ చేశారు. మీరు వెంటనే వెళ్లి దేవెగౌడకు నా మాటగా చెప్పండి, కష్టం ఉంటే ఇద్దరం కలిసి పంచుకోవడం తప్ప తమాషాలు చేయొద్దని, ప్రజల మధ్య అలా గొడవలు సృష్టించవద్దని అన్నారు.
అంటే రాజకీయంకోసం కూడా ప్రజల్లో కలహాలు సృష్టించే స్వభావం కాదు రామారావు గారిది.చాలా ఉదార స్వభావం,ఉన్నత విలువలున్న మనిషి, మంచిని ప్రేమించే మనిషి, ప్రాంతీయ పార్టీ నేతనే అయినా, విశాల జాతీయ భావాలతో,రాజనీతిజ్ఞతతో ఆలోచించేవారు,వ్యవహరించేవారు..












