
ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చారు నందమూరి తారకరామారావు. అధికారం అంటే కొందరి సొత్తు కాదు అని నిరూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, అది ఒక సామాజిక విప్లవం.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ అధికారం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండేది.ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పటేల్-పట్వారీ వ్యవస్థల ప్రభావం ఎక్కువగా ఉండేది.వెనుకబడిన తరగతులయిన బిసి లను రాజకీయంగా మేల్కొల్పడం ద్వారా ఆయన సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలని బిసి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు.స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, వేల సంఖ్యలో వెనుకబడిన వర్గాల నేతలు సర్పంచులుగా, ఎంపీపీలుగా,జడ్ పి టి సి లుగా,ఎమ్మెల్యేలుగా,ఎంపీ లుగా ఎదిగే అవకాశం లభించింది. గతంలో ఉన్న తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థ ను తీసుకురావడం వెనుక ఉన్న ఎన్ టి ఆర్ ప్రధాన ఉద్దేశ్యం సామాన్యుడికి పాలనను చేరువ చేయడం.ఆ రిజర్వేషన్ల వల్ల మొదటిసారిగా ఓబిసి వర్గాల వారు జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులుగా ఎదిగారు.ఇది బిసి వర్గాలను రాజకీయాలకు ఒక పెద్ద నాయకత్వ బృందాన్ని లీడర్ షిప్ ను తయారు చేసింది.
ఎన్టీఆర్ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా,వారిని నిర్ణయాధికారులు గా మార్చారు.దీనివల్ల వెనుకబడిన వర్గాల్లో ఒక రకమైన రాజకీయ చైతన్యం, ఆత్మగౌరవం పెరిగింది.నేడు అనేక ప్రాంతాల్లో బీసీలు రాజకీయంగా బలంగా ఉన్నారంటే, దానికి పునాది అప్పట్లో ఎన్ ఆర్ వేసిన ఆ రిజర్వేషన్ల ఫలితమే.అప్పట్లో ఆ నిర్ణయంపై కొంతమంది కోర్టులకు వెళ్లినా,రాజకీయంగా వ్యతిరేకించినా ఎన్ టి ఆర్ వెనక్కి తగ్గలేదు. బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధం అనే ధోరణి ప్రదర్శించారు.వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన నిజమైన ప్రజాస్వామ్యవాది ఎన్టీఆర్ అని చెప్పాలి.ఎన్ టి ఆర్ వేసిన ప్రతి అడుగు వెనుక ఒక బలమైన చట్టబద్ధత ఉండేది. ఎన్టీఆర్ స్థానిక సంస్థల రూపురేఖలను మార్చడానికి ప్రధానంగా రెండు చట్టాలను ప్రవేశపెట్టారు.ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్, జిల్లా పరిషత్, మరియు జిల్లా ప్రణాళికా బోర్డుల చట్టం 1986 పాత తాలూకా మరియు పంచాయతీ సమితి వ్యవస్థను రద్దు చేసి,1,100కు పైగా మండలాలను ఏర్పాటు చేశారు.ఈ చట్టం ద్వారానే మండల అధ్యక్ష పదవుల్లో మరియు జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారు.గ్రామ స్థాయిలో సర్పంచ్ పదవుల్లో కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఈ చట్టంలో మార్పులు చేశారు.
రిజర్వేషన్ల కు ముందు, గ్రామాల్లో ఒక సామాజిక వర్గం వారు మాత్రమే ఆ కుర్చీలో కూర్చునేవారు. ఎన్టీఆర్ తెచ్చిన చట్టం వల్ల, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా అదే కుర్చీలో కూర్చుని గ్రామాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇది సమాజంలో ఉన్న అగ్రవర్ణ ఆధిపత్యానికి చట్టబద్ధంగా దెబ్బతీసింది.నేడు మనం చూస్తున్న ఎంతోమంది రాష్ట్ర స్థాయి, మండల స్థాయి,జాతీయ స్థాయి బీసీ నాయకులు.ఆనాడు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన మండల వ్యవస్థలో మండల అధ్యక్షులు గా, సర్పంచులుగా రాజకీయ ఓనమాలు దిద్దినవారే.ఎన్ టీ ఆర్ రాజకీయ నాయకులను తయారు చేసే కర్మాగారాన్ని తయారు చేశారు. భారత రాజ్యాంగంలో 73, 74 సవరణలు [స్థానిక సంస్థల రిజర్వేషన్లు] 1992-93లో వచ్చాయి.కానీ ఎన్టీఆర్ దానికి 6-7 ఏళ్ల ముందే 1986లోనే ఆంధ్రప్రదేశ్ లో ఆ విప్లవాత్మక మార్పును అమలు చేసి చూపించడం అంటే, ఎన్ టి ఆర్ దేశానికే ఒక పథనిర్దేశకుడు గా నిలిచారు.ఆ రోజుల్లోనే.












