
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయం భారతీయ సామాజిక చరిత్రలోనే ఒక విప్లవం.ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఆయనకు ఉన్న గౌరవం.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఆడబిడ్డల ఆత్మగౌరవానికి దక్కిన అపూర్వ గౌరవం.ఆడబిడ్డ పుట్టింటికి అలంకారం మాత్రమే కాదు,ఆ ఇంటికి వారసురాలు కూడా అని బలంగా నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన సీఎం అయిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అంతకుముందు మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. తల్లిదండ్రులు ప్రత్యేకంగా కూతుళ్ళకు రాసిస్తే తప్ప వాటా వచ్చేది కాదు. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి కుమారులకు మాత్రమే దక్కేది. దానిని ఎన్టీఆర్ మార్చి కుమార్తెలకు కూడా సమాన హక్కు కల్పించారు.ఆ మహోన్నత నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించాయి. ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయంతో మహిళాలోకం మురిసిపోయింది.1982 ప్రాంతంలో సమాజంలో మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది.పెళ్లి తర్వాత వర కట్నం రూపంలో ఇచ్చే దాంతోనే వారి హక్కులు ముగిసిపోయేవి.ఆ వివక్షను రూపుమాపి, మహిళలకు సామాజిక రక్షణ, మరియు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ హిందూ వారసత్వ ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం,1986 ని తీసుకువచ్చారు.ఆ చట్టం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా సమానమైన వాటా కల్పించడం. ఆస్తి హక్కు కల్పించడం వల్ల కుటుంబంలో మరియు సమాజంలో మహిళల నిర్ణయాధికారం పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.వర కట్నం అనేది భిక్ష లాంటిదని, ఆస్తిలో హక్కు అనేది ఆడబిడ్డ జన్మహక్కు అని ఎన్ టి ఆర్ చాటి చెప్పారు.కష్టకాలంలో పుట్టింటి ఆస్తి తనకు అండగా ఉంటుందనే ధైర్యం మహిళల్లో కల్పించారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టినప్పటి నుంచే కొడుకుతో సమానంగా కూతురు కూడా సమాన హక్కుదారు అవుతుంది. ఆస్తి పంపకాల సమయంలో కుమారులకు ఏ విధంగా అయితే వాటా లభిస్తుందో, కుమార్తెలకు కూడా అదే నిష్పత్తిలో వాటా దక్కుతుంది.
ఎన్ టి ఆర్ తెచ్చిన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వేలాది మంది మహిళలు తమకు దక్కిన ఆర్థిక భరోసాతో నిలదొక్కుకున్నారు. అందుకే ఆయనను కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, తమ కష్టాలు తీర్చిన సొంత అన్నగా భావించి మహిళా లోకం నీరాజనాలు పట్టింది.ఎన్ టి ఆర్ ను మహిళలు అన్న గా పిలిచేవారు. నేటికీ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండటానికి ఆనాడు ఎన్ టి ఆర్ వేసిన పునాదియే కారణం.మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి వారికి కేవలం ధనాన్ని ఇవ్వడం కాదు, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు ఎన్ టి ఆర్.ఒక్క మహిళలకు ఆస్తి చట్టమే కాదు.అనేక పథకాలు ప్రకటించి ఎన్టీఆర్ మహిళల పక్షపాతిగా నిలిచారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారుఎన్టీఆర్. తిరుపతిలో పద్మావతి పేరుతో వర్సిటీ నెలకొల్పారు. అప్పట్లో ఇదొక సహసోపేత నిర్ణయం.అన్ని విద్యా సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీలో మహిళల అక్షరాస్యత పెరిగింది ఎన్టీఆర్ హయాంలోనే. ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలతో మహిళలు అగ్రగామిగా నిలవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించి అమలుచేసి చూపించారు ఎన్టీఆర్.












