
నాకు ఎన్టీ రామారావు గురించి మొదట తెలిసింది సినిమా చూసి కాదు.
మా ఇంటి మాటల్లోనే తెలిసింది.
మా ఇంట్లో ఎవరూ ఆయనను “ఎన్టీఆర్” అని పిలిచేవారు కాదు. ఎప్పుడూ “ఎన్టీ ఓడు” అనేవారు. ఆ పేరులో ఒక దగ్గరితనం ఉండేది. ఒక ప్రేమ ఉండేది. ఒక గౌరవం ఉండేది. ఆయన మా కుటుంబానికి చెందిన మనిషిలా మాట్లాడుకునేవారు.
నేను చిన్నదాన్ని. రాజకీయాలు ఏమిటో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంది దూరదర్శన్లో ఆయన ప్రసంగం వస్తే, మా ఇంట్లో ఒక చిన్న పండగలాంటిది ఉండేది. టీవీ ముందు కుర్చీలు పెట్టేవారు. పక్కింటివాళ్లు కూడా వచ్చి కూర్చునేవారు. ఆయన మాట్లాడుతుంటే ఇంటంతా నిశ్శబ్దంగా మారేది.
“చూడండి… ఎన్టీ ఓడు ఇలా అంటున్నాడు…”
“ఇది బాగుంది…”
అలా మాటలు వినిపించేవి.
కానీ అసలు భావోద్వేగం వార్తల తర్వాత కనిపించేది.
మా ఇంటి ముందు వరండాలో మా నాన్న మా బాబాయి, వారి స్నేహితులు కూర్చుని చాలా సీరియస్గా మాట్లాడుకునేవారు. పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు, ఆయన ధైర్యంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ చర్చించేవారు. వాళ్ల కళ్లల్లో ఒక గర్వం కనిపించేది.
నాకు అప్పట్లో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది వాళ్లు కేవలం ఒక ముఖ్యమంత్రిని గురించి మాట్లాడటం కాదు. వాళ్లు తమ గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు.
మా నాన్న, మా ఊరి పెద్దలు ఆయన సభల కు వెళ్లేవారు . నాకు సభ అంటే ఏమిటో తెలియదు. కానీ ఇంట్లో ఎవరో అన్న మాట మాత్రం ఇంకా చెవుల్లో వినిపిస్తుంది
“నీ నాన్న ఎన్టీ ఓడు కోసం వెళ్లాడు.”
అది కేవలం ఒక సభ కాదు.
అది ఒక విశ్వాసం.
అది ఒక ఆశ.
అది ఒక తరం గుండెల్లో వెలిగిన దీపం.
సినిమాల్లో ఆయన దేవుడిలా కనిపించారు. రాజకీయాల్లో ఆయన తుఫానులా వచ్చారు. కానీ మా లాంటి ఇళ్లలో ఆయన ఒక అనుబంధం. ఒక నమ్మకం.
ఆయన తెలుగు ప్రజలకు ఇచ్చింది కేవలం పాలన కాదు.
ఆయన వారికి ఆత్మగౌరవం ఇచ్చారు.
తలెత్తి నిలబడే ధైర్యం ఇచ్చారు.
మన భాష మీద గర్వం కలిగించారు.
తెలుగు ప్రజలు “మన వాళ్లు” అని గర్వంగా చెప్పుకునే రోజులు తీసుకొచ్చారు.
అందుకే ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు.
ఒక జ్ఞాపకం.
ఒక భావం.
ఒక యుగం.
ఆ యుగం ఇప్పటికీ మన గుండెల్లో ఉంది.
రచయిత గురించి
తులసి పద్మశ్రీ
మార్పు వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు.
సమాజంలో మార్పు తీసుకురావాలనే నమ్మకంతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ప్రజల జీవితాల్లోని నిజమైన కథలను, జ్ఞాపకాలను, అనుభవాలను తన రచనల ద్వారా పంచుకుంటున్నారు.












