
భారతదేశ రాజకీయ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అయిన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ పథకం తెలుగునాట వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సామాన్యుల నుండి రైతుల జీవితాలను ఏంతో ప్రభావితం చేశాయి.పేద రైతులకు విద్యుత్ బిల్లులు భారం తగ్గించి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, సాగు ఖర్చులను తగ్గించడానికి ఎన్ టి ఆర్ ఆ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.కరెంట్ బిల్లుల భారంతో సతమతమవుతున్న సామాన్య రైతుకు తక్కువ ధరకే విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగ చేయడం ఆ పథకం ప్రధాన ఉద్దేశ్యం.ఒక హార్స్ పవర్ మోటారుకు నెలకు కేవలం 50 రూపాయల చొప్పున నామమాత్రపు విద్యుత్ ఛార్జీని నిర్ణయించి అప్పటివరకు ఉన్న మీటర్ల పద్ధతిని పక్కన పెట్టి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించిన పథకం అది.ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు.సంపన్నులకే పరిమితమైన విద్యుత్ సౌకర్యాన్ని సామాన్యుడి ముంగిటకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆ నిర్ణయంతో ఎన్టీఆర్ పట్ల గ్రామీణ ప్రజల్లో విపరీతమైన అభిమానం పెరిగి ఆయనను రైతు పక్ష పాతిగా కొనియాడారు రైతులు.1982 లో వ్యవసాయం పూర్తిగా వర్షాధారం పై ఆధారపడి ఉండేది. బావులు, బోరు బావుల కింద సాగు చేసే రైతులకు విద్యుత్ బిల్లులు మోయలేని భారంగా మారాయి. మీటర్ల రీడింగ్ పేరిట విద్యుత్ శాఖ సిబ్బంది వేధింపులు, పెరిగిన చార్జీలతో రైతులు ఆత్మహత్యల దిశగా వెళ్తున్న తరుణంలో రైతు పక్షపాతిగా ఎన్.టి.ఆర్ ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ పథకం ద్వారా రైతు ఎంత కరెంట్ వాడినా,ఎన్ని గంటలు మోటార్ నడిపినా,హార్స్‌పవర్‌కు కేవలం 50 రూపాయలు మాత్రమే.ఇది వ్యవసాయానికి రక్షణ కవచంగా నిలిచింది.ఆ రోజుల్లో ఇది ఆర్థిక నిపుణులు అసాధ్యం అన్నారు.ప్రతిపక్షాలు దివాలా పాలన అన్నారు.కానీ ఎన్.టి.ఆర్ ఒక మాట అన్నారు రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుంది అన్నారు. వ్యవసాయం ఖర్చు నుంచి ఉత్పత్తిగా మారిన రోజులు అవి. పంటల విస్తీర్ణం పెరిగింది. రైతుల్లో ప్రతి నెల విద్యుత్ బిల్లు అనే భయం పోయింది.ఆహారోత్పత్తి పెరిగింది.అది విద్యుత్ పథకం కాదు రైతు గౌరవం.ఈ పథకం స్వావలంబన గల ఉత్పత్తి దారుడిగా రైతుని మార్చింది.వ్యవసాయాన్ని నిలబెట్టిన 50 రూపాయల సంస్కరణ అది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎన్.టి.ఆర్ రైతుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయారు. అప్పట్లో అమల్లో ఉన్న సంక్లిష్టమైన విద్యుత్ చార్జీల విధానాన్ని రద్దు చేస్తూ, హార్స్ పవర్ (HP) ప్రాతిపదికన సంవత్సరానికి కేవలం 50 రూపాయలకే విద్యుత్ అందించేలా చట్టం తెచ్చారు. మీటర్ల రీడింగ్‌తో సంబంధం లేకుండా, మోటార్ సామర్థ్యాన్ని బట్టి ఫిక్స్డ్ ధర నిర్ణయించారు. రీడింగ్ తీసే అధికారులు రైతులను లంచాల కోసం వేధించే పరిస్థితి దీనివల్ల తప్పింది. రైతులకు సాగు నీరు పెట్టుకోవడంపై నమ్మకం పెరిగింది.ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవించాయి. విద్యుత్ చౌకగా లభించడంతో వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి. ఖర్చు తగ్గడంతో రైతులు మిగిలిన డబ్బును విత్తనాలు, ఎరువులపై వెచ్చించి దిగుబడిని పెంచగలిగారు చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ పథకం ఒక వరప్రసాదంగా మారింది.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ విద్యుత్ రాయితీ కీలక పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ చరిత్రలో 50 రూపాయలకే హార్స్ పవర్ పథకం ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఎన్.టి.ఆర్ ప్రారంభించిన ఆ ఫ్లాట్ రేట్ విద్యుత్ విధానం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది. నేడు మనం చూస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకానికి పునాది వేసింది కూడా ఎన్.టి.ఆర్ తీసుకున్న ఆనాడు సాహసోపేత నిర్ణయమే అని చెప్పాలి.ఎన్.టి.ఆర్, అన్నదాతను దేవుడిలా భావించారు. 50 రూపాయలకే విద్యుత్ అందించడం అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఒక మహత్కార్యం.అందుకే నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎన్.టి.ఆర్ ను,ఆయన అమలు చేసిన పధకాలను గుర్తు చేసుకొంటుంటారు .
కరెంటు బిల్లుల భారంతో కుంగిపోతున్న రైతుల వెన్నుతట్టి ధైర్యాన్ని ఇచ్చారు ఎన్ టి ఆర్.చీకటి రోజుల్లో రైతన్న పొలంలో వెలుగులు నింపాలని, సాగును ఒక పండుగలా మార్చాలని సంకల్పించిన ధీశాలి ఎన్.టి.ఆర్. హార్స్ పవర్ కు కేవలం 50 రూపాయలకే విద్యుత్ లక్షలాది రైతు కుటుంబాల తలరాతను మార్చిన ఒక చారిత్రాత్మక పథకం అది. రాజకీయాల్లోకి రాకముందే రైతుల కష్టాలను ఎరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కాగానే ఎన్ టి ఆర్ దృష్టి సాగుపై పడింది.రీడింగ్ పేరిట జరిగే దోపిడీని అరికడుతూ,నా రైతుకు లెక్కలు తెలియవు, నా రైతుకు కష్టపడి పండించడం మాత్రమే తెలుసు” అని భావించి ఫ్లాట్ రేట్ విధానాన్ని తెచ్చారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమమే పరమావధిగా ఈ పథకాన్ని అమలు చేసి దేశానికే మార్గదర్శిగా నిలిచారు ఎన్ టి ఆర్.












